Sanjay Raut: ఆర్ఎస్ఎస్ చీఫ్ కుంభమేళాకు వెళ్లారా?.. సంజయ్ రౌత్ ప్రశ్న

రాజకీయ నేతలు కుంభమేళా (Kumbh Mela)లో పాల్గొనడంపై శివసేన (షిండే), శివసేన (యూబీటీ) నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ థాకరే (Uddhav Thackeray) తాను హిందువునని, హిందూ ధర్మాలను పాటిస్తానని చెప్పుకున్నా కూడా కుంభమేళాకు వెళ్లలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) విమర్శించారు. ఈ విషయంపై రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్రంగా స్పందించారు. “బీజేపీకి చెందిన నాయకులు అందరూ కుంభమేళాకు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయా?” అని రౌత్ ప్రశ్నించారు.
హిందూ ధర్మ పరిరక్షణ గురించి ప్రజలకు బోధనలు చేసే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయలేదే? అని రౌత్ చెప్పారు. “ప్రధాని నరేంద్ర మోదీ పవిత్ర స్నానం చేస్తున్న ఫొటోలను చూశాను. కానీ, ఆయన ప్రధానమంత్రి కాకముందు కుంభమేళాకు వెళ్లినట్లు మాత్రం ఆధారాలు లేవు. ప్రస్తుతం నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు మోహన్ భాగవత్, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, గురు గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరాస్ వంటివారు పవిత్ర స్నానం ఆచరించినట్లు ఎలాంటి ఫొటోలు బయటకు రాలేదే?” అని రౌత్ (Sanjay Raut) ప్రశ్నించారు. ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) మాట్లాడుతూ.. “కొందరు నేతలు వారు హిందువులని చెప్పుకుంటుంటారు. కానీ, పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమైన కుంభమేళాకు మాత్రం వెళ్లలేదు” అని అన్నారు. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) మహాకుంభమేళాకు వెళ్లకుండా హిందువులను అవమానపరిచారని ఆరోపించారు. హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలని షిండే సూచించారు.