Vijay: జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునర్విభజనను ఒప్పుకోం: టీవీకే అధినేత విజయ్

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) విషయంపై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), దక్షిణాది రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ (Vijay) ఈ విషయంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పునర్విభజన ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
‘కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) గురించి అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. ఈ ప్రక్రియ తాజా జనాభా లెక్కల ఆధారంగా జరిగితే, పార్లమెంటులో దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీన్ని మేము ఏ విధంగానూ అంగీకరించం. గత 50 సంవత్సరాలుగా, తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో గణనీయమైన విజయాలు సాధించాయి. అలాంటప్పుడు ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను విభజించడం (Delimitation) సరైనది కాదు. ఒకరి విజయం కోసం మరొకరిని శిక్షించడం అన్యాయం. దక్షిణ రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య తగ్గించి, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు పెంచడం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. ఈ విషయంపై అన్ని పార్టీలతో కలిసి పోరాడుతాం,’ అని విజయ్ (Vijay) స్పష్టం చేశారు.
అదే సమయంలో ఈ విషయంపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే, బీజేపీ మధ్య జరుగుతున్న గొడవపై కూడా విజయ్ (Vijay) స్పందించారు. ఇలా ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గడం సాధారణ ప్రజలకు ప్రధాన సమస్య కాదని ఆయన తేల్చిచెప్పారు. ‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, రోడ్లు వంటి ప్రాథమిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఈ సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి,” అని సూచించారు.