Venkaiah Naidu: ఇలాగైతే భవిష్యత్తులో అప్పులు కూడా దొరకలి పరిస్థితి: పాలకులకు వెంకయ్యనాయుడు వార్నింగ్

అప్పులు తీర్చే మార్గాలు లేకుండా కొత్తగా అప్పులు ఇవ్వని పరిస్థితి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన.. ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఓట్ల కోసం అన్నీ ఫ్రీగా ఇస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతోంది. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలోకి తెలుగు రాష్ట్రాలు పడిపోయాయి. అప్పులు అనేవి ఉచితంగా రావన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడం తీవ్ర ప్రమాదకరం. హద్దు మీరి అప్పులు చేస్తే.. భవిష్యత్తులో అప్పులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. రాష్ట్రాల ఆర్థిక స్థితిని బట్టి అప్పులు తీసుకోవాలి. ఏపీ, తెలంగాణ నేతలు పరిస్థితిని అర్థం చేసుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) సూచించారు. ‘‘ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై మాత్రమే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. భావితరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. విద్య, వైద్యం తప్ప మరే విషయంలోనూ ఉచితాల పథకం అమలు చేయకూడదు,” అని వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) పేర్కొన్నారు.