America :104 మంది వలసదారులను తీసుకొచ్చిన అమెరికా విమానం

భారత్‌కు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా (America) నుంచి బయలుదేరిన సైనిక విమానం బుధవారం అమృత్‌సర్ (Amritsar)కు చేరుకుంది. మధ్యాహ్నం 1:55 గంటలకు శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానం దిగింది. ఇందులో అమెరికా వెనక్కి పంపిన వారిలో 33 మంది చొప్పున హరియాణా(Haryana), గుజరాత్ (Gujarat)ల నుంచి, 30 మంది పంజాబ్ నుంచి, ముగ్గురేసి చొప్పున మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌ల నుంచి, ఇద్దరు చండీగఢ్ నుంచి ఉన్నారు. అమృత్‌సర్‌కు తీసుకొచ్చిన వారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. విమానాశ్రయం బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమృత్‌సర్‌కు చేరుకున్న అక్రమ వలసదారులను పోలీసులు (Police) తనిఖీ చేసి, వారి వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు. వారిలో ఎవరికైనా నేర చరిత్ర ఉందా అని పోలీసులు ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని స్వీకరిస్తుందని, ఇందులో భాగంగా విమానాశ్రయంలో కౌంటర్లు ఏర్పాటు చేశామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ (Gaurav Yadav )అంతకుముందు తెలిపారు.