Chandrasekaran :టాటా సన్ చైర్మన్ చంద్రశేఖరన్‌కు అరుదైన గౌరవం

టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ (Chandrasekaran) కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ ప్రభుత్వం (British Government) ఆయనకు గౌరవ నైట్ హుడ్(Knighthood) పురస్కారాన్ని ప్రకటించింది. యూకే-భారత్ వ్యాపార బంధానికి ఆయన చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వెల్లడిరచింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన విదేశీ పౌరులను ఈ పురస్కారంతో గౌరవిస్తుంటారు. నైట్‌హుడ్ పురస్కారం లభించడంపై చంద్రశేఖరన్ స్పందించారు. ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కింగ్ ఛార్లెస్ (King Charles )కు కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ, కన్జూమర్, ఆతిథ్యం, ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్ వంటి రంగాల్లో యూకేతో పటిష్టమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నామని, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ లాంటి ఐకానిక్ బ్రిటిష్ బ్రాండ్లు నిర్వహిస్తుండడం కూడా టాటా గ్రూపు (Tata Group)నకు గర్వకారణమని పేర్కొన్నారు. యూకేలో తమ సంస్థల్లో 70 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని చంద్రశేఖరన్ తెలిపారు.