Thackeray Brothers: ఏకతాటిపైకి ఠాక్రేలు .. మరాఠీ రాజకీయం మారుతుందా…?

ప్రాథమిక విద్యలో హిందీబోధన దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇది సరికాదని..ప్రాథమిక దశలో హిందీ విద్యాబోధన అవసరం లేదంటున్నారు ఠాక్రేలు. అయితే వీరి మాటలను సర్కార్ పట్టించుకోలేదు. జాతీయ విద్యావిదానంలో భాగంగా .. మహారాష్ట్రలోనూ హిందీ బోధనను అమలుచేస్తోంది. ఈ పరిణామంపై ఉద్ధవ్ శివసేనలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు..మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) అధ్యక్షుడు -రాజ్ ఠాక్రే సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఉమ్మడిగా పోరాటం చేస్తారా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దశాబ్దాల క్రితం విడిపోయిన ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు.. కలిసి ముందుకెళ్తారన్న అభిప్రాయాలను నిజం చేస్తూ.. కామెంట్స్ చేశారు ఉద్ధవ్ ఠాక్రే. బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన(Sivasena)కు.. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే దూరమైతే ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధమేనని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన(యూబీటీ) ప్రకటించింది.దూరమైపోయిన ఇద్దరు సోదరులు తిరిగి దగ్గరకు వస్తారన్న ఆలోచనే మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గాలకు ఆందోళన కలిగిస్తోందని ఆ పార్టీ పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వేరుపడిపోయిన ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఇటీవల గతం మరిచి తిరిగి ఒకటి కావాలన్న ఆకాంక్షను వెల్లడిస్తూ పత్రికా ప్రకటనలు వెలువరించారు. మహారాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న వారిని దూరంపెడితే రాజ్ ఠాక్రేతో తనకున్న చిన్న చిన్న విభేదాలను విస్మరించడానికి తాను సిద్ధమని ఉద్ధవ్ ప్రకటించారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్‌నాథ్ శిందే(Shindey) నేతృత్వంలోని శివసేన తీవ్ర విమర్శలు చేసింది. ఆయనో అభినవ దుర్యోధనుడని పేర్కొంది. బాల్‌ఠాక్రే స్థాపించిన పార్టీలో రాజ్ ఠాక్రేను ఆయన ఎదగనివ్వలేదని ఆరోపించింది. శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ నరేశ్ మష్కే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. క్షీణిస్తున్న పార్టీని కాపాడుకోవడంలో భాగంగానే ఉద్ధవ్ ఠాక్రే ఈ చర్యలు చేపట్టారని విమర్శించారు. ‘‘యూబీటీ వర్గంలో జనాలను ఆకట్టుకునే నేత లేడు. దీంతో వారు రాజ్ ఠాక్రే వైపు మొగ్గు చూపిస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభలో పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక ఉద్ధవ్ ఠాక్రే అభినవ దుర్యోధనుడు. పార్టీలో రాజ్ ఠాక్రేకు కీలక బాధ్యతలు అప్పగించాలని బాలాసాహెబ్ కోరినా.. ఆయనను పార్టీలో ఎదగనివ్వలేదు’’ అని ఆరోపించారు.