ట్రంప్ మనకు స్నేహితుడే … సంబంధాల్లో ఎలాంటి సమస్య లేదు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మిత్రుడని, భారత్-అమెరికా మధ్య స్నేహం చిగురించి మరింతగా వృద్ధి చెందుతుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అన్నారు. భారత్`అమెరికా భాగస్వామ్యంలో ఎలాంటి సమ్యలను తాను ఊహించడం లేదని పేర్కొన్న ఆయన, వాషింగ్టన్‌లో కొత్త పరిపాలనలో అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో వివిధ కార్యక్రమాలు సంస్కరణలపై మీడియాతో మాట్లాడుతూ టెస్లా-స్టార్‌లింక్ పెట్టుబడి ప్రణాళికలు, ల్యాప్‌టాప్ దిగుమతి విధానం, యూరోపియన్ యూనియన్ ఏకపక్ష గ్రీన్ ఎకానమీ నిబందనల వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భారత్ సహా అన్ని ప్రధాన దేశాలలో విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధిస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే, పరస్పర పన్ను ప్రవేశపెడతానని తెలిపారు. కాగా, నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడైన ప్రధాని మోదీ భారత దేశ అంతర్జాతీయ సంబంధాలను గతంలో కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు గోయల్ ఈ సందర్భంగా అన్నారు. మోదీ నేతృత్వంలో అమెరికాలో భారతదేశ సంబంధాలు ప్రతి సంవత్సరం మెరుగవుతున్నాయని అన్నారు.