Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్ ఎన్నికల ముందు ఆప్‌కు భారీ షాకిచ్చిన ముగ్గురు కౌన్సిలర్లు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. మేయర్ ఎన్నికలకు (Delhi Mayor Polls) ముందు ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరడం ఆప్‌కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆధ్వర్యంలో ఈ ముగ్గురూ కాషాయ కండువా కప్పుకున్నారు. వచ్చే ఏప్రిల్‌లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు (Delhi Mayor Polls) జరగాల్సి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇలా ముగ్గురు నేతలు ఆప్ వీడటం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారనుంది. ఆ పార్టీకి చెందిన ఆండ్రూస్ గంజ్ కౌన్సిలర్ అనిత బసోయా, హరినగర్ కౌన్సిలర్ నిఖిల్ చాప్రాన, ఆర్కేపురం కౌన్సిలర్ ధర్మవీర్.. ముగ్గురూ బీజేపీలో చేరారు. వీరిని పార్టీలోకి ఆహ్వానించిన వీరేంద్ర సచ్‌దేవా.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. వచ్చే మేయర్ ఎన్నికల్లో (Delhi Mayor Polls) కూడా జయకేతనం ఎగరేసి, ఢిల్లీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారును బీజేపీ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.