MK Stalin: కేంద్రంపై పోరాటానికి కదలిరండి.. ప్రజలకు స్టాలిన్ పిలుపు!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్టాలిన్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ భాషను ప్రోత్సహించడం వల్ల 25 భారతీయ భాషలు కనుమరుగైపోయాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తమిళనాడుకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రతి పౌరుడు ముందుకు రావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసిన ఆయన (MK Stalin).. తమిళనాడు ప్రజలంతా ఈ ఉద్యమం కోసం కదలిరావాలన్నారు.
“ప్రస్తుతం తమిళనాడు రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదటిది త్రిభాషా (NEP) విధానం, రెండోది నియోజకవర్గాల పునర్విభజన (Delimitation). త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించినందుకు కేంద్రం మన రాష్ట్రానికి రావలసిన నిధులను నిలిపివేసింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడు ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తోంది. కేంద్రం (Center) తన ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించే సమయం వచ్చింది. ఈ విషయాలపై పోరాడేందుకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలి. మన పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను” అని స్టాలిన్ (MK Stalin) పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర ప్రభుత్వ (Center) నిర్ణయాలను ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా తమిళనాడుతో సంఘీభావం తెలిపాయి. “తమిళనాడులో పార్లమెంటు నియోజకవర్గాలను తగ్గించడం (Delimitation) లేదని కేంద్రం చెప్తోంది. కానీ మిగతా రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పెంచబోడం లేదని మాత్రం హామీ ఇవ్వలేకపోతుంది. మా డిమాండ్ స్పష్టంగా ఉంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయించకూడదు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా తమిళనాడు ప్రతిఘటిస్తుంది” అని స్టాలిన్ (MK Stalin) స్పష్టం చేశారు.
https://x.com/mkstalin/status/1895284282517565724