Raghav Chadha: ఏఐ కాదూ ఏక్యూఐ గురించి మాట్లాడండి : రాఘవ్ చద్దా

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మాట్లాడాల్సింది ఏఐ గురించి కాదని ఏక్యూఐ గురించి అని ఆమ్‌ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా (raghav chadha) అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో కొనసాగుతున్న చర్చల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దా ఢిల్లీ వాయు కాలుష్యం అంశాన్ని లేవనెత్తారు. రైతులు పంట వ్యవర్థాలను దహనం చేయడం వల్లే ఢిల్లీ (Delhi) లో వాయు కాలుష్యం పెరుగుతుందనే వాదనలు సరైనవి కాదని ఆయన పేర్కొన్నారు. దానికి సంబంధించిన పలు నివేదికలను చూపించారు. రైతులకు వేరే మార్గం లేకపోవడంతో వ్యర్థాలను దహనం చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏఐ (AI) గురించి చర్చిస్తూ డిజిటల్ మోసాల బెదిరింపులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడడంపై చద్దా స్పందిస్తూ కేంద్రం చర్చించాల్సింది ఏఐ గురించి కాదు, ఏక్యూఐ ( వాయు నాణ్యత సూచిక) గురించి అని పేర్కొన్నారు. ఢిల్లీ కాలుష్యం నుంచి బయటపడాలంటే ఏక్యూఐ గురించి తప్పక చర్చించాలని అన్నారు.