Stalin: 25 భాషలను హిందీ మింగేసింది.. తమిళనాడులో ఆ పరిస్థితి రానివ్వం: స్టాలిన్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి హిందీ (Hindi) భాషపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడం వల్ల దేశంలో 25 ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాష గురించి ఎక్స్ వేదికగా స్పందించిన స్టాలిన్ (MK Stalin), “ఇవాళెవరూ ఈ విషయాన్ని ప్రశ్నించకపోతే, మరిన్ని భాషలు అంతరించిపోవడం ఖాయం. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా లాంటి భాషలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఉత్తరప్రదేశ్, బిహార్‌లు నిజానికి హిందీ మాట్లాడే రాష్ట్రాలు కావు. కానీ కాలక్రమేణా అక్కడి ప్రాంతీయ భాషలను హిందీ (Hindi) మింగేసింది. తమిళనాడులో అలాంటి పరిస్థితి రాకుండా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం,” అని స్పష్టం చేశారు.
కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానం (NEP)లో హిందీకి ప్రాధాన్యతనిచ్చి ప్రాంతీయ భాషలను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందని, తాము మాత్రం ద్విభాషా విధానాన్ని కొనసాగిస్తామని డీఎంకే (DMK) మరోసారి తేల్చిచెప్పింది. మరోవైపు, బీజేపీ-డీఎంకే మధ్య హిందీ అంశంపై జరుగుతున్న మాటల యుద్ధం.. తమిళనాడులో రచ్చరచ్చగా మారుతోంది. దీనిపై ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ (Vijay) స్పందిస్తూ, “ఇది రెండు పార్టీలు చేస్తున్న చిన్నపిల్లల గొడవే. అసలు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి” అని సూచించారు.