MVA Alliance: మహారాష్ట్రలో ఎంవీఏ కూటమికి షాక్.. కటీఫ్ చెప్పేసిన సమాజ్ వాదీ పార్టీ!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) (MVA Alliance) కూటమి పార్టీల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. తాజాగా బాబ్రీ మసీదు కూల్చివేత గురించి శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ మిలింద్ సర్వేకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ విభేదాలను బట్టబయలు చేశాయి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన మిలింద్.. బాబ్రీ మసీదును కూల్చివేసిన వారి పట్ల తాను గర్వంగా ఉన్నానంటూ శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. దీనిపై సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి కామెంట్స్ చేస్తే.. ఇక బీజేపీకి, శివసేన (యూబీటీ)కి తేడా ఏముందని సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తమ అధినేత అఖిలేశ్ యాదవ్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఆయన అంగీకారంతో తాము ఎంవీఏ (MVA Alliance) కూటమి నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ కూటమితో కలిసి పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇలా సమాజ్ వాదీ తీసుకున్న షాకింగ్ నిర్ణయంపై శివసేన (యూబీటీ) నుంచి ఎలాంటి స్పందన రాలేదు.