CAG: లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ఖజానాకు రూ.2000 కోట్ల నష్టం: కాగ్

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీ (Liquor Policy) వల్ల ఏకంగా రూ.2000 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని కాగ్ (CAG) రిపోర్టు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటు చేసిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే.. ఆప్ సర్కారు హయాంలో జరిగిన అవినీతిపై కాగ్ రిపోర్టును బీజేపీ ప్రభుత్వం (BJP Government) ప్రవేశపెట్టింది. కాగ్ (CAG) ఈ రిపోర్టులో లిక్కర్ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరిగిందని వెల్లడించింది. 2021-22లో అమలైన మద్యం విధానం ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2000 కోట్ల మేర ఆర్థిక నష్టం వచ్చిందని కాగ్ (CAG) నివేదిక స్పష్టం చేసింది.
కాగ్ నివేదిక ప్రకారం, నూతన మద్యం విధానం రూపకల్పనలో పారదర్శకత లేదు. అలాగే నిపుణుల అభిప్రాయాలను కూడా లెక్కచేయలేదు. బెల్ట్ షాపులకు లైసెన్సు దక్కించుకున్న వారికి అనూహ్యమైన మినహాయింపులు కల్పించడం వంటి అంశాలను కాగ్ (CAG) రిపోర్టు గుర్తించింది. దీని వల్ల ప్రభుత్వం రూ.941.53 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.890.15 కోట్లు, రాయితీల వల్ల మరో రూ.144 కోట్లు నష్టపోయిందని రిపోర్టు (CAG) తెలిపింది. కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం విధానంపై (Liquor Policy) తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని అమలు చేసిన కొద్ది నెలలకే దాన్ని ఆప్ సర్కారు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వంటి కీలక ఆప్ నేతలు ఈ లిక్కర్ పాలసీ (Liquor Policy) కేసులో అరెస్టయిన సంగతి కూడా తెలిసిందే.