Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా.. మహిళా ముఖ్యమంత్రికే బీజేపీ ఓటు!

ఢిల్లీ కొత్త సీఎంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను (Rekha Gupta) బీజేపీ నియమించింది. గురువారం నాడు ఆమె ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా.. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థి, ఆప్ నేత బందన కుమారిపై 29,595 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏబీవీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమె (Rekha Gupta).. బీజేపీలో పలు కీలక పదవుల్లో సత్తాచాటారు. కాగా, ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖ (Rekha Gupta) సేవలందించనున్నారు. గతంలో బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, ఆప్ నుంచి ఆతిషీ.. ముఖ్యమంత్రులుగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక రేఖ ప్రమాణ స్వీకారానికి బీజేపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.34 గంటల మధ్య ఢిల్లీ సీఎంగా రేఖ (Rekha Gupta) ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు, బీజేపీ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవనున్నారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ సీఎం ఆతిషీని కూడా బీజేపీ ఆహ్వానించడం గమనార్హం.