Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కాంగ్రెస్

కుంభ మేళాకు వెళ్లేందుకు భక్తుల భారీగా ఢిల్లీ రైల్వేస్టేషన్ (Delhi Railway Station Stampede) చేరుకోవడంతో, అక్కడ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. ఎంతోమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని కాంగ్రెస్ మండిపడింది. మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పుడు, రైల్వే స్టేషన్లో (Delhi Railway Station Stampede) మెరుగైన ఏర్పాట్లు చేయాలి కదా? అని కాంగ్రెస్ కీలకనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే!
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. “ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట.. మరోసారి రైల్వే శాఖ వైఫల్యాన్ని, ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాటలో (Delhi Railway Station Stampede) ఇంత మంది చనిపోవడం, గాయాలపాలవటం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని అన్నారు.
మృతుల సంఖ్యను వెల్లడించండి : ఖర్గే
ఇదే క్రమంలో ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను దాచి పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. “ఈ ఘటనలో ఎంతో మంది మరణించారన్న వార్తలు చాలా బాధించాయి. ఈ తొక్కిసలాటలో (Delhi Railway Station Stampede) ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్యను దాచేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం చాలా సిగ్గుచేటు. మృతులు, గాయపడిన వారి సంఖ్యను ప్రభుత్వం త్వరగా ప్రకటించాలి.” అని ఖర్గే తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.