Rahul Gandhi: ఢిల్లీ ఫలితాలను స్వీకరిస్తున్నాం.. ప్రజల కోసం పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి, 27 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపట్టనుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఈ క్రమంలో ఢిల్లీ ఫలితాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఢిల్లీ ప్రజల తీర్పును తాము వినమ్రంగా అంగీకరిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజా సమస్యలపై మాత్రం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని రాహుల్ (Rahul Gandhi) స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు, అలాగే తమ పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు రాహుల్ (Rahul Gandhi) ధన్యవాదాలు తెలిపారు. కాలుష్యం, ద్రవ్యోల్బణం, అవినీతిపైనా తమ పోరాటం ఆగబోదని, అలాగే ఢిల్లీ అభివృద్ధి కోసం, ఢిల్లీ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా తమ ఖాతాలో వేసుకోలేకపోయింది. కానీ, గత ఎన్నికలతో పోలిస్తే తమ ఓటు బ్యాంకు పెరిగిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇలాగే ప్రజల కోసం పోరాడితే 2030లో తాము అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ కీలక నేత జైరాం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.