Rahul Gandhi: ఏఐపై వట్టి మాటలతో ఉపయోగం లేదు: రాహుల్ గాంధీ

భారత దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనుకంజలో ఉందని, ఈ విషయంలో వట్టి మాటలు చెప్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. డ్రోన్లు, ఏఐ వంటి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలంటే దేశానికి చాలా బలమైన పునాది ఉండాలని సూచించిన రాహుల్.. డ్రోన్ సాంకేతికతను వివరించే ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ”యుద్ధ రంగంలో డ్రోన్లు చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్స్ వంటి వాటిని వాటికి జత చేస్తే.. ఈ డ్రోన్లు ఆర్మీతో కమ్యూనికేట్ అవుతున్నాయి. డ్రోన్లు కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు.. ఇవి బలమైన పారిశ్రామిక వ్యవస్థతో చేసిన ఆవిష్కరణలు. వీటిని అర్థం చేసుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు.
ఏఐపై ఆయన ప్రసంగాలకే పరిమితమవుతుంటే మన పోటీ దేశాలు మాత్రం కొత్త టెక్నాలజీలను సృష్టింస్తున్నాయి,” అని రాహుల్ (Rahul Gandhi) తన పోస్టులో పేర్కొన్నారు. మన దేశంలో ట్యాలెంట్ ఉన్న ఇంజనీర్లు ఉన్నప్పటికీ మోడ్రన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నామని రాహుల్ బాధపడ్డారు. ఈ విషయంలో ముందుకెళ్లాలంటే స్పష్టమైన వ్యూహం అవసరమని, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, దేశాన్ని ముందుకు నడిపేందుకు బలమైన పారిశ్రామిక వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా అవసరమని రాహుల్ (Rahul Gandhi) వివరించారు.