పీవీ సింధుకు పార్లమెంట్ అభినందనలు

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‍లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధును పార్లమెంట్ ఉభయ సభలు అభినందించాయి. లోక్‍సభ స్పీకర్ ఓం బిర్లా సింధు విజయాన్ని ప్రస్తావించారు. టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్యం సాధించడం ఆనందంగా వుందని, ఆమెకు ఇది వరుసగా రెండో ఒలింపిక్ పతకం అని అన్నారు. వరుసగా రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలు కావడం విశేషం అన్నారు. యువతకు ఆమె స్ఫూర్తి అని స్పీకర్ కొనియాడారు. ఆమె సాధించిన విజయాలు ఈ దేశ యువతకు ప్రేరణకు నిలుస్తుందని భావిస్తున్నట్లు ఓం బిర్లా వెల్లడించారు.
తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఒలింపిక్స్లో సింధు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని, వరుసగా రెండు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారని వెంకయ్య అభినందించారు.