Mallikarjun Kharge: ఓట్ల చోరులను ఈసీ కాపాడుతోంది.. బిహార్‌లో జరగనివ్వం: ఖర్గే

ఓటరు జాబితా నుంచి ఓట్లను తొలగించడం ద్వారా ఓట్ల చోరీకి ఎన్నికల కమిషన్ సహకరించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆరోపణలు చేశారు. పదేళ్లుగా ఈసీ ఓటు చోరీ చేస్తున్న వారిని కాపాడుతూ కీలక సమాచారాన్ని దాచిపెట్టిందని ఖర్గే విమర్శించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపుకు ప్రయత్నించినప్పుడు, తాము దాన్ని అడ్డుకున్నామని ఖర్గే చెప్పారు. వేలమంది ఓటర్ల ఓటు హక్కును అప్పుడు కాపాడామని ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. కానీ, స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, ఈసీ కీలక సమాచారాన్ని దాచిపెట్టి ఓట్ల చోరీకి పాల్పడిన వారిని రక్షించిందని ఆరోపించారు. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ, ఈసీ ఓట్ల చోరీ ద్వారా గెలవాలని కుట్ర చేస్తున్నారని ఖర్గే అన్నారు. మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్డీయే ఓట్ల చోరీ చేసిందని ఆరోపించారు. కానీ, బిహార్‌లో మాత్రం బీజేపీని, ఈసీని ఒక్క ఓటు కూడా దొంగిలించబోనివ్వమని అన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బిహార్‌లో చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతుందని ఆయన (Mallikarjun Kharge) పేర్కొన్నారు.