అయోధ్య రామయ్యను దర్శించుకోనున్న రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ( మే 1న) అయోధ్య పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారు. అదేవిధంగా హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సరయూ పూజ, హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాదాపు మూడు గంటలపాటు అయోధ్యలో ఉండనున్నారు. ఆమె పర్యటన కొనసాగినంత సేపు నగరంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. రేపు సాయంత్రం సరయూ నదీ తీరాన రాష్ట్రపతి హారతి కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో అధికారులు సంబంధిత ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రపతి ముర్ముకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వాగతం పలుకనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అయోధ్య పరిసరాల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.