PM Modi: ప్రపంచ కర్మాగారంగా భారత్ ఎదుగుతోంది: ప్రధాని మోదీ

ప్రపంచ కర్మాగారంగా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. దశాబ్దాలుగా ఇతర దేశాలు భారత్‌ను ఒక బ్రాంచ్‌లా చూసేవని, అయితే ఇప్పుడు ఆ దృక్పథం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు. దేశ రాజధానిలో జరిగిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ఆయన, ప్రపంచ దేశాలు భారత్‌ను ఆసక్తిగా గమనిస్తున్నాయని, దేశం అభివృద్ధిలో సరికొత్త దిశలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారత్ ఒకప్పుడు శ్రామిక శక్తిగా గుర్తింపు పొందిందని, కానీ ఇప్పుడు అది ప్రపంచ శక్తిగా పరిణామం చెందిందని మోదీ (PM Modi) అన్నారు. సెమీకండక్టర్లు, విమాన వాహక నౌకలు, ఆటోమొబైల్ పరిశ్రమల్లో భారత్ వేగంగా ఎదుగుతోందని చెప్పారు. మనదేశ సూపర్‌ఫుడ్‌లు, ఆయుష్ ఉత్పత్తులు, యోగా, ధ్యానం వంటి విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నాయన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు మూడోసారి ఎన్నుకోవడం తమపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని మోదీ (PM Modi) చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రారంభమైన గ్లోబల్ న్యూస్ ఛానల్ (NewsX World) దేశ విజయాలను అంతర్జాతీయంగా ప్రచారం చేయడంలో కీలక భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్ విస్తృతంగా అభివృద్ధి చెందుతూ, ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోందని మోదీ అన్నారు. ఇటీవల జరిగిన మహాకుంభమేళా దేశ నిర్వహణా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో అనేక కాలపరిమితి ముగిసిన చట్టాలను రద్దు చేసి, దేశ అభివృద్ధికి దోహదపడే విధంగా కొత్త చట్టాలను రూపొందించామని మోదీ (PM Modi) పేర్కొన్నారు.