Rameshwaram: రామేశ్వరం- శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులు

తమిళనాడులోని రామేశ్వరం(Rameshwaram) – శ్రీలంకలోని తలైమన్నార్ (Talaimannar) ల మధ్య ఫెర్రీ సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ (Modi) వెల్లడించారు. రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందానికి త్వరలో ఓ తుది రూపం ఇచ్చేందుకు అంగీకరించామని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayake) తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ తమిళల ఆకాంక్షలను శ్రీలంక నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ (India) లో పర్యటించిన శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, ఇంధన, వాణిజ్యంతో పాటు పలు కీలక రంగాల్లో సంబంధాలపై చర్చించామని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ఆయా రంగాల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తామని, రెండు దేశాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపరిచేందుకు గాను రామేశ్వరం- తలైమన్నార్‌ల మధ్య ఫెర్రీ సర్వీసులు ప్రారంభించనున్నట్లు మోదీ ప్రకటించారు.