Supreme Court: మెడిసిన్ ధరలు నియంత్రించడంలో రాష్ట్రాలు విఫలం: సుప్రీంకోర్టు

మెడిసిన్ ధరలు పెరగడంపై రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా విమర్శించింది. అందుబాటు ధరల్లో వైద్య సదుపాయాలను అందించడంలో రాష్ట్రాలు విఫలమయ్యాయని పేర్కొంది. ఇలా రాష్ట్రాలు విఫలం అవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహం లభించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రైవేటు ఆస్పత్రులు.. తమ ఫార్మసీల్లో తయారుచేసే అధిక ధరలనున్న మెడిసిన్స్‌ను బలవంతంగా రోగులు, వారి కుటుంబాల నెత్తిన రుద్దుతున్నాయని, ఇలా చేయడం వల్ల రోగులు దోపిడీకి గురవుతున్నారని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ప్రైవేటు ఆస్పత్రులు రోగులను తమ ఫార్మసీల నుండి మందులు కొనుగోలు చేయాలని బలవంతం చేయకుండా నిరోధించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషనర్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాయని, దీని వల్ల రోగులు అనవసరంగా ఆర్థిక భారాన్ని మోయవలసి వస్తోందని సదరు పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు (Supreme Court) కూడా పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. రోగులకు సూచించిన మందులు ఇతర చోట్ల తక్కువ ధరకు లభిస్తున్నప్పుడు, ప్రైవేటు ఆస్పత్రులు వారిని తమ ఫార్మసీల నుండి కొనుగోలు చేయాలని బలవంతం చేయకూడదని తెలిపింది. ముఖ్యంగా పేద వర్గాలకు ప్రాణాధార ఔషధాలు అందుబాటు ధరల్లో లభించడం కష్టమైపోయిందని కోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. పౌరులు ఈ రకమైన దోపిడికి గురికాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయంపై గతంలోనే అనేక రాష్ట్రాలకు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఈ నోటీసులపై స్పందించాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ధరల నియంత్రణ ఆదేశాలనే తాము అనుసరిస్తున్నట్లు కోర్టుకు ఆయా రాష్ట్రాలు తెలిపాయి. అత్యవసర ఔషధాలు అందుబాటు ధరల్లో లభించేలా వాటి ధరలను నిర్ణయించినట్లు కూడా పేర్కొన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టుకు (Supreme Court) సమాధానం ఇస్తూ.. ఆస్పత్రులలోని ఫార్మసీల నుండి మందులు కొనుగోలు చేయాలని రోగులపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది.