రాజస్థాన్ లో అదానీ పెట్టుబడులు.. కాంగ్రెస్ పై విమర్శలకు బదులిచ్చిన రాహుల్
రాజస్థాన్ రాష్ట్రంలో అదానీ భారీగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో సుమారు రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అదానీ ప్రకటించారు. ఈ ప్రకటనను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా స్వాగతించారు. ఈ నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు అదానీని ఆడిపోసుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు మెచ్చుకోవడం ఏంటని ఆ పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్నాటకలో రోడ్ షో చేస్తున్న రాహుల్ గాంధీ.. వ్యాపారవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపడంలేదని స్పష్టం చేశారు. తాము కార్పొరేట్ వ్యవస్థలకు వ్యతిరేకం కాదని చెప్పిన రాహుల్.. కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. ఒకవేళ తప్పుడు పద్ధతిలో గనుక రాజస్థాన్ ప్రభుత్వం అదానీకి e వ్యాపారాలు అప్పగిస్తే, అప్పుడు దాన్ని కూడా తాను వ్యతిరేకిస్తానని వివరించారు. ఒక వ్యాపారవేత్త 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతానంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఎందుకు కాదంటారు? అని రాహుల్ ప్రశ్నించారు.






