Nirmala Sitaraman: కొత్త ఐటీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

పార్లమెంటులో నూతన ఆదాయపు పన్ను (New Income Tax Bill) బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా.. బిల్లును నిరసిస్తూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని (New Income Tax Bill) తీసుకువస్తోంది. విపక్షాల నిరసన గళాల మధ్య నిర్మలా సీతారామన్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్‌సభను మార్చి 10కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి ఈ 64 ఏళ్లలో ఎన్నో సవరణలు జరిగాయి. వీటి కారణంగా బిల్లు చాలా సంక్లిష్టంగా మారిందని, పన్ను చెల్లింపుదారులకు ఖర్చులు పెరిగాయని కేంద్రం గతంలోనే చెప్పింది. ఈ క్రమంలోనే ఈ సంక్లిష్టతలను సమీక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త ఆదాయపు పన్ను బిల్లును (New Income Tax Bill) సిద్ధం చేసి, పార్లమెంటులో ప్రవేశపెట్టింది.