కరోనా లాంటి క్లిష్ట సమయంలో ‘యోగా’ మార్గదర్శిగా మారింది : మోదీ

ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనాతో తీవ్రంగా పోరాడుతున్నాయని, కరోనాను ‘యోగా’ అనే దివ్యౌషధంతో ఓడించగలమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనాను జయించగలమన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని యోగా అందిస్తుందని అన్నారు. ఒత్తిడిని తగ్గించడంలో, శారీరక బలాన్ని పెంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ వర్చువల్‌గా జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రజల అంతర్గత బలానికి యోగా ఓ వనరుగా ఉపయోగపడుతుందని, స్వీయ క్రమశిక్షణకు యోగా సహకరిస్తుందని తెలిపారు. భారత్‌తో సహా అనేక దేశాలు కరోనాకు బలయ్యాయని, ఏ దేశం వద్దా సరైన వసతులు కూడా లేవని, అలాంటి సమయంలో యోగా ఓ రక్షణ కవచంలా మారిపోయిందని ఆయన తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు యోగా ఓ అద్భుతమైన కవచంగా మారిందని, వాటికి సంబంధించిన అనేక వీడియోలు మనకు లభ్యమవుతూనే ఉన్నాయని తెలిపారు. తమ తమ దైనందిన జీవితాల్లో యోగాను ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని, ప్రతికూల ఆలోచనల నుంచి మార్గదర్శకత్వం వైపు తీసుకెళ్లే శక్తి యోగాకు ఉందని మోదీ తెలిపారు.
ఎమ్-యోగా యాప్ ఆవిష్కరణ
యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘ఎమ్- యోగా’ యాప్‌ను ప్రారంభించారు. దీనిలో యోగాకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు ఉంటాయి. అన్ని భాషల్లోనూ ఈ యాప్ ద్వారా శిక్షణ తీసుకోవచ్చు. యోగాను ప్రపంచం నలుమూలకూ పరివ్యాప్తం చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.