Shashi Tharoor: ఆ విషయం చర్చించి ఉంటే బెటర్.. మోదీ అమెరికా పర్యటనపై శశిథరూర్ రియాక్షన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సంతృప్తికరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (MP Shashi Tharoor) ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని, ఈ సమావేశంలో ప్రధాని హుందాగా వ్యవహరించారని శశిథరూర్ మెచ్చుకున్నారు. ఈ క్రమంలో దేశం ఎదుర్కొంటుందని అనుకున్న పలు సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంపై అమెరికా విధిస్తున్న పన్నులపై కూడా శశిథరూర్ (MP Shashi Tharoor) తన అభిప్రాయవ వెలిబుచ్చారు.. అమెరికా ఇలా అధికంగా పన్నులు వేస్తోందనే కారణంతో, మనం తొందరపాటు చర్యలు తీసుకుంటే అది భారత దేశం నుండి ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని శశిథరూర్ వివరించారు.
అలాగే అక్రమ వలసదారులపై ప్రధాని మోదీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు కూడా సబబుగానే ఉన్నాయని ఆయన (MP Shashi Tharoor) అభిప్రాయపడ్డారు. చట్టవిరుద్ధంగా ఏ దేశంలోకి ప్రవేశించినా, అక్కడ నివసించే హక్కు వారికి ఉండదని స్పష్టం చేసిన మోదీ.. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికైనా, ఎవరికైనా ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు. అలా వెళ్లిన భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చేయాలని మోదీ కోరారు.
ఈ విషయంలో అమెరికా ఎంతమంది భారతీయులను తిప్పి పంపినా, తాము స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన శశిథరూర్.. ఈ మాటలు సబబే కానీ, అక్రమ వలసదారులను పంపే విధానం మార్చేలా చర్చించి ఉంటే బాగుండేదని, ఈ విషయంపై వ్యక్తిగత సమావేశంలో ట్రంప్, మోదీ చర్చించి ఉంటారని అనుకుంటున్నానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం భారత్‌కు పంపిన అక్రమ వలసదారులకు ఖైదీల్లా చైన్లు వేసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శశిథరూర్ (MP Shashi Tharoor) ఈ వ్యాఖ్యలు చేశారు.