Mayawati: మాయావతి షాకింగ్ నిర్ణయం.. మేనల్లుడిపై వేటు!

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షురాలు మాయావతి (Mayawati) సంచలన ప్రకటన చేశారు. కొంతకాలం క్రితమే తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను (Akash Anand) ప్రకటించిన ఆమె.. తాజాగా నిర్వహించిన పార్టీ సమావేశం తర్వాత ఆకాశ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆకాశ్‌ను పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆకాశ్ తండ్రి ఆనంద్ కుమార్‌తో పాటు, రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్‌ను కొత్త జాతీయ స్థాయి సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు మాయావతి (Mayawati) వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని బహుజన సమాజం అభివృద్ధి చెందడం రాష్ట్ర ప్రగతికి మాత్రమే కాకుండా యావత్ దేశాభివృద్ధికి అవసరమని మాయావతి (Mayawati) ఉద్ఘాటించారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జన్మదిన వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను కూడా వివరించిన ఆమె.. ఆయన సిద్ధాంతాలను పార్టీ ఎప్పటికీ నిబద్ధతతో పాటిస్తుందని మాటిచ్చారు. వాటి ప్రకారమే పార్టీలో పని చేసే తన కుటుంబసభ్యులను తాను ఎన్నడూ వ్యతిరేకించలేదని తెలిపారు. అయితే, పార్టీ విధానాలకు హాని కలిగించే విధంగా వారిలో ఎవరైనా ప్రవర్తిస్తే, వెంటనే వారిని పార్టీ నుంచి తొలగిస్తానని మాయావతి (Mayawati) వార్నింగ్ ఇచ్చారు. ఈ నియమానికి అనుగుణంగానే, బీఎస్పీ సంస్థాగత బలాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిన ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థ్‌ను గతంలో పార్టీ నుంచి బహిష్కరించాడం జరిగిందని, ఇప్పుడు ఆకాశ్ ఆనంద్‌ను కూడా పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. సిద్ధార్థ్ చర్యలు ఇప్పటికే ఆకాశ్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుండడం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి (Mayawati) పేర్కొన్నారు.
తన సోదరుడు ఆనంద్ కుమార్‌కు పార్టీ వ్యవహారాలను నిర్వహించగల సామర్థ్యం ఉందన్న మాయావతి.. అతడిపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ముకానీయలేదని మెచ్చుకున్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి (Mayawati) గతంలో తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించి, తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆకాశ్ ఇంకా పరిణతి సాధించలేదని అప్పట్లో పేర్కొన్నారు. మళ్లీ గతేడాది జూన్‌లో ఆకాశ్‌ను తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. పార్టీలో పూర్తి పరిణతితో పనిచేసేందుకు ఆకాశ్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు మాయావతి (Mayawati) అప్పట్లో చెప్పారు.