Manipur: ఆయుధాలను వారంలోగా అప్పగించండి.. ప్రజలకు మణిపూర్ గవర్నర్ ఆదేశం

మణిపూర్‌లో (Manipur) రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న నేపథ్యంలో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రజలు తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా సమీప పోలీస్‌స్టేషన్ లేదా భద్రతా దళాల క్యాంపుల్లో అప్పగించాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత గడువులో ఆయుధాలను సమర్పిస్తే ఎలాంటి శిక్షలు ఉండవని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత రెండేళ్లుగా జాతుల మధ్య వివాదాలతో మణిపూర్ (Manipur) అశాంతికి గురైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం బీరెన్ సింగ్ కూడా ఇటీవలే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులపై గవర్నర్ భల్లా మాట్లాడుతూ, “20 నెలలుగా మణిపూర్ (Manipur) ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అందరూ కలిసికట్టుగా శాంతి స్థాపనకు సహకరించాలి. ముఖ్యంగా యువత హింసా మార్గాన్ని విడిచిపెట్టాలి. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు.