Mani Shankar Aiyar: రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ నేత (Congress leader) మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) తన వివాదస్పద వ్యాఖ్యలతో సొంత పార్టీని మరోసారి ఇరుకున పెట్టారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని (Rajiv Gandhi) ఉద్దేశిస్తూ అయ్యర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, అలాంటి వ్యక్తి దేశ ప్రధాని ఎలా అయ్యారో? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజీవ్ గాంధీ, నేను.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నాం. అప్పట్లో ఆయన పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. యూనివర్సిటీలు స్టూడెంట్స్‌ను పాస్ చెయ్యడానికే ప్రయత్నిస్తాయి. కానీ, రాజీవ్ మాత్రం ఫెయిలయ్యారు. ఆ తర్వాత లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో కూడా ఫెయిల్ అయ్యారు. చదువు విషయంలో ఆయన చాలా కష్టపడ్డారు కానీ.. పరీక్షల్లో పాస్ అవ్వలేకపోయారు. రెండు సార్లు పరీక్షలో ఫెయిలై, పైలట్‌గా పని చేసిన వ్యక్తి దేశ ప్రధాని అవుతారని నేను అస్సలు ఊహించలేదు. ఇది ఎలా జరిగిందో?’’ అని అయ్యర్ (Mani Shankar Aiyar) అన్నారు.
బీజేపీ విమర్శలు..
అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) గతంలో కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో తన ఎదుగుదలకు, పతనానికి ‘గాంధీ కుటుంబమే’ కారణమని కూడా అన్నారు. గత పదేళ్లలో ఎన్నిసార్లు ప్రయత్నించినా.. పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని (Sonia Gandhi) ఒక్కసారి కూడా కలిసే అవకాశం ఇవ్వలేదన్నారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీలతో (Priyanka Gandhi) కూడా ఒకటి, రెండు సార్లు మాత్రమే భేటీ అయ్యానని అయ్యర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో చిన్న నేతలకు సరైన గుర్తింపు ఉండదని కూడా అయ్యర్ గతంలోనే చెప్పారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. త్వరలోనే అయ్యర్ పార్టీ మారతారని, బీజేపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేం జరగలేదు. అదే పార్టీలో కొనసాగిన అయ్యర్ (Mani Shankar Aiyar).. ఇప్పుడు మరోసారి తన కాంట్రవర్షియల్ కామెంట్స్‌తో పార్టీని ఇరుకున పెట్టారు.