Mamata Banerjee: ఈసీ కార్యాలయం ముందు దీక్ష చేస్తా : మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. ఎన్నికల సంఘం సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో బీజేపీ (BJP) చేర్చుతోందని దుయ్యబట్టారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం (Election Commission) కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానని హెచ్చరించారు.
తృణమూల్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన దీదీ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) నియమించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తు చేశారు. ఓటర్ల జాబితాను సరిచేసి, తప్పుడు ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈసీ కార్యాలయం ముందు దీక్ష చేపడతానని అన్నారు.