Mamata Banerjee : ఆ ఆరోపణల్ని నిరూపిస్తే రాజీనామా చేస్తా : దీదీ సవాల్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. బంగ్లాదేశ్ (Bangladesh) ఛాందసవాదులతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. బంగ్లాదేశ్ ఛాందసవాదులతో చేతులు కలిపారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi )కి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అసెంబ్లీలో దీదీ మాట్లాడుతూ బీజేపీ (BJP) తీరుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడటానికి అనుమతించడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారు. విద్వేషాలను వ్యాప్తి చేయడానికి, ప్రజల్ని విభజించడానికి వారికి వాక్ స్వాతంత్య్రం అనుమతించదు. బీజేపీ మతాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. నేను జాతీయ భద్రత లేదా విదేశాంగ విధానం వంటి అంశాల జోలికి వెళ్లను. కానీ, అమెరికా(America) నుంచి అక్రమవలసదారుల్ని గొలుసులతో బంధించి వెనక్కి పంపించడం సిగ్గుచేటు. వారిని అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం విమానాలు పంపాలి. బీజేపీ ఎమ్మెల్యే నన్ను ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు. అందుకే నేను సభలో మాట్లాడుతున్నప్పుడు బాయ్‌కాట్ చేసి వెళ్లిపోతున్నారు అని అన్నారు.