MUDA Scam: ముదా స్కాంలో సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల కుంభకోణం (MUDA Scam) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతికి లోకాయుక్త పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. వీరికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు తెలిపారు. ఈ అంశంపై తుది నివేదికను త్వరలోనే హైకోర్టులో సమర్పిస్తామని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ కుంభకోణం (MUDA Scam) కేసులో తొలి నలుగురు నిందితులపై ఆరోపణలు వచ్చినప్పటికీ, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల లభించకపోవడంతో కేసు నిరూపితం కాలేదని చెప్పారు. ఈ నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లోపు తమకు తెలపాలని స్నేహమయికి లోకాయుక్త పోలీసులు గడువు ఇచ్చారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని నొక్కి చెప్పారు.
కాగా, ముడా కుంభకోణంలో (MUDA Scam) సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపింది. దీంతో ఈ కేసు తెరపైకి వచ్చీ రాగానే రాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త విచారణకు ఆదేశించింది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం విచారణ చేపట్టిన కోర్టు.. గత సెప్టెంబరులో నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జునపై కేసులు నమోదు చేసిన లోకాయుక్త పోలీసులు విచారణ ప్రారంభించారు.