అమెరికా నుంచి మాకు ఏ సమాచారం లేదు : భారత్

భారత బిలియనీర్ గౌతం అదానీపై ఇటీవల అమెరికన్ ప్రాసిక్యూటర్లు చేసిన లంచాలు, మోసాల నేరారోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తొలిసారిగా స్పందించింది. దీనికి సంబంధించి అమెరికా నుంచి తమకు ముందస్తుగా ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొంది. ఈ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇది కొన్ని ప్రయివేటు పరిశ్రమలు, నిర్దిష్ట వ్యక్తులు, అమెరికా న్యాయవిభాగానికి సంబంధించిన చట్టపరమైన వ్యవహారమన్నారు. ఇప్పటిదాకా భారత సర్కారుకు ఎటువంటి సంబంధం లేదని ఈ అంశంపై అమెరికా ప్రభుత్వంతో తాము ఎటువంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. ఇటువంటి కేసుల్లో ఇప్పటికే ఏర్పాటు చేసుకొన్న కొన్ని విధానాలు, చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తారనే భావిస్తున్నాం అన్నారు. అదానీ కేసులో అమెరికా సమన్ల లేదా వారంటు ఏదైనా పంపిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ అటువంటి విజ్ఞప్తి ఏదీ భారత్‌కు అందలేదన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి సమన్ల జారీ లేదా అరెస్టు వారంట్ల వంటి వినతులు ఏవైనా పరస్పర న్యాయ సహకారంలో భాగంగా ఉంటాయి. ఇలాంటి అభ్యర్థనలను వాటి యోగ్యత ఆధారంగా పరిశీలిస్తాం అని తెలిపారు.