Supreme Court : అది దురదృష్టకరమే కానీ… సుప్రీంకోర్టు

కుంభమేళా తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ, దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్‌ను తిరస్కరించింది. దీనిపై అలహాబాద్ (Allahabad) హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో జరుగుతున్న మహా కుంభమేళా లో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. సంగం ఘాట్ (Sangam Ghat) వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీనికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ విశాల్ తివారీ అనే న్యాయవాది ఇటీవల సుప్రీంలో పిల్ వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై యూపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తు జరుగుతోందని, ఇదేతరహాలో ఓ పిల్ హైకోర్టులో దాఖలైందని సుప్రీంకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.