Siddaramaiah: సీఎం భవనం రినొవేషన్‌కు రూ.2.6 కోట్లు.. సిద్ధరామయ్యపై ‘శీష్‌మహల్’ ఆరోపణలు!

ఇప్పటికే ముడా స్కామ్‌లో (MUDA) ఆరోపణలను ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు. అచ్చం ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై వచ్చినట్లే సిద్ధరామయ్యపై కూడా ‘శీష్ మహల్’ (అద్దాలమేడ) (Sheeshmahal) అంటూ విమర్శలు వస్తున్నాయి. సిద్ధరామయ్య అధికారిక నివాసాన్ని రినొవేషన్ కోసం ప్రజాపనుల విభాగం దాదాపు రూ.2.6 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్థక శాఖ బయటపెట్టడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ప్రభుత్వం వద్ద నిధులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో, అధికారులు ఇలా అనవసర ఖర్చులు చేయడమేంటని బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన మిగతా పనులు పూర్తిచేసిన తర్వాత కావాలంటే సీఎం (CM Siddaramaiah) తన సొంత పనులు చేసుకోవడంపై దృష్టిసారించాలని ఉదయ్ సూచించారు. ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో, ప్రభుత్వం నిధులను ఇలాంటి పనులకు వినియోగించడం ఏంటని నిలదీశారు.
ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని ఉదయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య (CM Siddaramaiah) అధికారిక భవనం పునరుద్ధరణలో రూ.1.7 కోట్లను హెల్పర్ రూమ్‌లు, ఇతర నిర్మాణాలకు ఖర్చుచెయ్యగా.. రూ.89 లక్షలను ఎలక్ట్రికల్ అప్‌గ్రేడ్, ఎయిర్ కండిషనింగ్ మొదలైన సదుపాయాల కోసం వినియోగించినట్లు ఆర్థికశాఖ నివేదికలు తెలిపాయి. దీనిపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. కాగా, మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) (MUDA) భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు సిద్ధరామయ్యపై (CM Siddaramaiah) ఇప్పటికే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జునపై ఈ స్కాంలో కేసులు నమోదయ్యాయి. ఈ స్కాంలో సీఎం, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవలే క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.