Kashmir: కశ్మీర్ ఉగ్రదాడిలో పెరుగుతున్న మృతులు…

జమూ కశ్మీర్ పహల్గాం జిల్లాలోని బైసరన్(Bysaran) ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 28కి చేరగా.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సమయంలో పలువురు తృటిలో తప్పించుకున్నారు.అది కూడా నిమిషాల వ్యవధిలోనే కావడం గమనార్హం.
ఓ వీడియోలో ఓ వ్యక్తి నడుస్తుండగా.. ఆ సమీపంలో నుంచి కాల్పుల మోతలు, అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఇక మరో వీడియోలో అదే వ్యక్తి మాట్లాడుతూ..ఉగ్రదాడి జరిగిందని చెబుతూ.. ఈ దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు. ఈ దాడి నుంచి తాను తృటిలో తప్పించుకొన్నానని చెప్పారు. తన ప్రాణాలు కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అలాగే ఇతరుల భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నానని సదరు వీడియోలో పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్ పహల్గాం జిల్లాలో బైసరన్ ప్రాంతంలో దేశ విదేశీ పర్యాటకుల పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం ఒక్కసారిగా సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 28 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే బైసరన్ మైదాన ప్రాంతం కావడంతో.. ఈ పర్యాటకులు తప్పించుకొనేందుకు మరో మార్గం లేకపోయింది.
ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగింది. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ ఘటనపై సమాచారం అందుకొన్న వెంటనే.. దుబాయ్ పర్యటనను కుదించుకొని.. భారత్ తిరిగి వచ్చేశారు. అలాగే పహల్గాం జిల్లాలో జరిగిన ఈ దాడిని ప్రపంచంలోని పలు దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఈఘటనను తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కష్టకాలంలో భారత్ కు అండగా నిలుస్తామన్నారు. మరోవైపు.. ఈచర్యను అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమాయకుల ప్రాణాలు హరించిన వారు తగిన శిక్షకు గురవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ కూడా.. ఈఘటనను ఖండించింది.