USAID: ‘ఆందోళనకరం’.. యూఎస్ఏఐడీ జోక్యంపై భారత్ సీరియస్..!

భారత్‌లో ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా గత అధ్యక్షుడు జో బైడెన్.. యూఎస్ఏఐడీ (USAID) ద్వారా రూ.182 కోట్ల నిధులను కేటాయించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఓటింగ్‌ను పెంచడం ద్వారా భారత్‌లో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యూఎస్‌ఏఐడీ (USAID) ప్రయత్నించిందనే వార్తలు కలవరపాటుకు గురిచేస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత విభాగాలు దృష్టి సారించాయని ఆయన చెప్పారు. ‘‘యూఎస్ కార్యకలాపాలు, నిధులకు (USAID) సంబంధించి అమెరికా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం చేసుకుందనే మాటలు ఆందోళనకరం. ఈ దశలో ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడటం తొందరపాటుగా ఉంటుంది. సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై (USAID) దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత.. ఈ అంశంపై మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.