Modi: ప్రపంచ టెక్స్‌టైల్ ఎగుమతుల్లో భారత్ ఆరో స్థానం.. మూడింతలు చెయ్యడమే లక్ష్యం: ప్రధాని మోదీ

ప్రపంచంలో అత్యధికంగా టెక్స్‌టైల్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ఆరో స్థానానికి చేరుకోవడం గొప్ప విజయమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కొనియాడారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ టెక్స్-2025 కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారత్ టెక్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెగా టెక్స్‌టైల్ ఈవెంట్‌గా మారిందన్నారు. భారతదేశం వస్త్ర ఎగుమతులు ప్రస్తుత రూ.3 లక్షల కోట్లుగా ఉండగా, 2030 నాటికి ఇది రూ.9 లక్షల కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అని మోదీ (PM Narendra Modi) తెలిపారు. ఈ లక్ష్యాన్ని 2030 కంటే ముందే సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
“భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో వస్త్రాలు ఎగుమతిచేసే ఆరో అతిపెద్ద దేశం. 2030 నాటికి వస్త్ర ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే మా లక్ష్యం. భారతదేశం వస్త్ర రంగంలో తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటుకుంటోంది. మన దేశం అధిక-గ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీ వైపు పయనిస్తోంది. వస్త్ర రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోంది. గత సంవత్సరం ఈ రంగం 7 శాతం వృద్ధిని సాధించింది, ఇది మన ప్రయత్నాల ఫలితమే” అని మోదీ (PM Narendra Modi) చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్-2025 కార్యక్రమం ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ మెగా ఈవెంట్‌లో 120కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి, ఇది భారతదేశ వస్త్ర రంగ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతుంది. ప్రపంచంలో భారతదేశ టెక్స్‌టైల్ రంగం ప్రాముఖ్యత పెరగడానికి ఈ కార్యక్రమం ఒక తొలి అడుగని చెప్పాలి.