కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ కామెంట్స్‌పై కేంద్రం ఆగ్రహం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు భారత్, జర్మనీ మధ్య వివాదానికి దారి తీస్తోంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా.. కేజ్రీవాల్ అరెస్టుపై, ఆయనపై జరుగుతున్న ఈడీ విచారణపై జర్మనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో భారత అంతర్గత విషయాల్లో జర్మనీ జోక్యంపై భారత ప్రభుత్వం మండిపడింది.
వివరాల్లోకి వెళితే.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై శుక్రవారం జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సదరు ప్రకటనలో భారత్ ప్రజాస్వామ్య దేశమని, అందువల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌పై విచారణ న్యాయపరంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలని, అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలన్నింటినీ ఎలాంటి పరిమితులు లేకుండా వినియోగించుకునేందుకు ఆయనకు అవకాశమివ్వాలని పేర్కొన్నారు. ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపింది.
కాగా.. జర్మనీ ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ఢిల్లీలోని జర్మనీ రాయబారికి సమన్లు పంపింది. దీంతో ఈ ఉదయం జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజ్వీలర్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఆయనతో చర్చించిన భారత విదేశాంగ శాఖ.. సదరు ప్రకటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, ఈ తరహా తీరును భారత్ సహించదని మండిపడింది. మరి ఈ అనవసర వ్యాఖ్యలపై జర్మనీ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.






