America: త్వరలో భారత్, అమెరికా చర్చలు

ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా(India, America) లు కొద్ది వారాల్లో చర్చలు ప్రారంభించనున్నాయి. ఒప్పంద స్థూల అంశాలు ఈ చర్చల్లో నిర్ణయమవుతాయని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ (Rajesh Agarwal) తెలిపారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యాన్ని ఇటీవల ప్రధాని మోదీ (Modi) అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాలూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగేలా, బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ( బీటీఏ)పై తొలి దశ చర్చలు 8-9 నెలల్లో పూర్తి అవుతాయని అగర్వాల్ పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా పారిశ్రామిక వస్తువుల ఎగుమతులు, అమెరికా కు భారత తయారీ ఉత్పత్తుల ఎగుమతులను విస్తృతం చేసుకోవడానికి ఇరు దేశాలూ అంగీకరించాయి. వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని పెంచడానికీ ఇరు పక్షాలు కలిసి పనిచేస్తాయి. 4 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ వస్తువులను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది. వీటికి మరింత ఊతం లభించనుందని అగర్వాల్ తెలిపారు.