ఇండియా కుబేరుల జాబితాలో లీలాకుమార్
డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ సేవల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎకొలైట్ డిజిటల్ అనే ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన లీలాకుమార్ కాజ, తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా కుబేరుల జాబితా 2022 లో తొలిసారిగా స్థానం సంపాదించారు. రూ.3,600 కోట్ల సంపదతో ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొదటి సారిగా ఈ జాబితాలో స్థానం సంపాదించిన వారిలో రెండో స్థానంలో నిలిచారు. 2007లో ఏర్పాటైన ఎకొలైట్ డిజిటల్లో 3,000 మందికి పైగా ఐటీ నిపుణులు, సిబ్బంది పనిచేస్తున్నారు.
అమెరికా, కెనడా, ఐరోపా దేశాలతో పాటు మనదేశంలో హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైలలో ఈ సంస్థ కేంద్రాలున్నాయి. 2025 నాటికి 10,000 మంది సిబ్బందితో 500 బిలియన్ డాలర్ల ఆదాయాలు ఆర్జించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఎకొలైట్ డిజిటల్లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ `న్యూ మౌంటెన్ కేపిటల్ పెట్టుబడి పెట్టింది. ఈ నిధులతో తమ వ్యాపార కార్యకలాపాలను బహుముఖంగా విస్తరించనున్నట్లు లీలాకుమార్ వెల్లడిరచారు.






