Gambhir: ఆ ఇద్దరి కెరీర్ గంభీర్ నాశనం చేస్తున్నాడా…?

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్ మంచి ఫైర్ మీద ఉన్నారు. గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై అభిమానులు ఆగ్రహంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన వన్డే సీరీస్ విషయంలో గంభీర్ అనుసరించిన వైఖరిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న కేఎల్ రాహుల్(KL Rahul), రిషబ్ పంత్(Rishab Pant) వ్యవహారంలో గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై అభిమానులు మండిపడుతున్నారు.
కేఎల్ రాహుల్ ఫుల్ టైం వికెట్ కీపర్ కాకపోయినా అతనిని వికెట్ కీపర్ కోటాలో జట్టులోకి తీసుకుంటున్నాడు గంభీర్. రిషబ్ పంత్ విషయంలో అన్యాయం చేస్తున్నాడనే ఆరోపణలు వినపడుతున్నాయి. దూకుడు స్వభావం కలిగిన రిషబ్ పంత్ ఇప్పటికే తానే ఏంటి అనేది నిరూపించుకున్నాడు. అలాంటి ఆటగాడికి కనీసం తుది జట్టులో చోటు కల్పించకపోవడం పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి.
రాహుల్ టాప్ ఆర్డర్ ఆటగాడు అయినా సరే.. అతనిని ఆరో స్థానంలో, ఏడో స్థానంలో బ్యాటింగ్ పంపడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనితో అతను స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోతున్నాడు. ఒత్తిడి ఉన్న సమయంలో అతన్ని బ్యాటింగ్ కు పంపడం, లేదంటే పరుగులు విలువలేని సమయంలో అతన్ని బ్యాటింగ్ కు దింపటం వంటివి విమర్శలకు దారితీస్తున్నాయి. ఇక బౌలింగ్ ఆల్రౌండర్ గా ఉన్న అక్షర పటేల్ ను మిడిల్ ఆర్డర్లో పంపడం, అతని తర్వాత కేఎల్ రాహుల్ ని పంపడం పై విమర్శలు వచ్చాయి.
ఇక మూడో వన్డేలో మాత్రం ముందు కెల్ రాహుల్ ను బ్యాటింగ్ పంపించాడు గంభీర్. ఇలాగే కొనసాగితే మాత్రం జట్టు మానసికస్థైర్యం దెబ్బతింటుందని, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం చచ్చిపోతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక టోర్నీలు ఉన్న సమయంలో కూడా.. ఈ విధంగా ఎలా వ్యవహరిస్తావని గంభీర్ పై అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.