Mohan Yadav: రూ.5 కే రైతులకు పర్మినెంట్ విద్యుత్ కనెక్షన్: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) రైతులకు కేవలం రూ.5కే పర్మినెంట్ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ఒక ర్యాలీలో ఆయన ఈ ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని మోహన్ యాదవ్ తెలిపారు. ఈ పథకం ద్వారా పర్మినెంట్ విద్యుత్ కనెక్షన్ లేని రైతాంగానికి లబ్ది చేకూరుతుందని ఆయన వివరించారు. రైతులకు మంచి చేయాలని, వారి జీవితాలు మెరుగుపడాలనే తాము కోరుకుంటున్నామని మోహన్ యాదవ్ (Mohan Yadav) అన్నారు.
అలాగే, రైతుల నీటిపారుదల సమస్యలను పరిష్కరించడానికి సోలార్ పంపుల ద్వారా విద్యుత్ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తామని మోహన్ యాదవ్ (Mohan Yadav) చెప్పారు. రాబోయే మూడేళ్లలో 30 లక్షల సోలార్ ఇరిగేషన్ పంపులను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పథకం క్రింద రైతుల నుంచి ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తుందని యాదవ్ వివరించారు. ఈ విధంగా రైతులు స్వచ్ఛమైన, స్థిరమైన శక్తి వనరులను ఉపయోగించుకోవడంతోపాటు, అదనపు ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారని ఆయన (Mohan Yadav) అన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన మౌలికవసతులు, విద్యుత్, రోడ్లు ఉండేవి కావని మోహన్ యాదవ్ (Mohan Yadav) విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులు మెరుగుపడ్డాయని, ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకాల ద్వారా రైతులు తమ పొలాలకు సులభంగా విద్యుత్ కనెక్షన్‌లను పొందగలుగుతారని, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచుకోగలుగుతారని ఆయన (Mohan Yadav) పేర్కొన్నారు.