మహారాష్ట్ర ఎన్నికలపై ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీ అనుమానాలు నివృత్తి చేస్తామన్న ఈసీ

మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏమైనా అనుమానాలుంటే డిసెంబర్ 3న వచ్చి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిలిగేషన్‌ను ఆహ్వానించింది. దేశంలో అన్ని ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని, ప్రతిపక్షాల చట్టపరమైన అనుమానాలను తాము పరిశీలిస్తామని ఈసీ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అనుమానాలు తెలుసుకొని, వారికి రాతపూర్వకంగా సమాధానం ఇస్తామని వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. పార్టీ నేతలు వ్యక్తిగతంగా ఎన్నికల సంఘానికి వచ్చి తమ అనుమానాలను తెలియజేస్తారని ఆ లేఖలో కాంగ్రెస్ పేర్కొంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ఈసీ నుంచి పిలుపు వచ్చింది.