DK Shivakumar: ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ.. సీఎం పదవి కోసమేనా?

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) త్వరలోనే సీఎం అవుతారనే వార్తలు ఇటీవల తెగ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)తో డీకే శివకుమార్ తాజాగా భేటీ అవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో త్వరలోనే డీకే శివకుమార్ సీఎం పదవి చేపట్టనున్నారని, దీని కోసమే ఆయన ఖర్గేను కలిశారనే వార్తలు మరింత జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే ఖర్గేతో తన సమావేశం గురించి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. “ఖర్గే గారిని కలవడం కేవలం ప్రోటోకాల్ ప్రకారం జరిగిన సమావేశం మాత్రమే. ఆయన మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మా నాయకుడు. ప్రోటోకాల్ ప్రకారం నేను ఆయనను స్వాగతించాల్సిన అవసరం ఉంది. అలాగే, బెంగళూరులో కాంగ్రెస్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించాం. ఈ సందర్భంగా ఆయనతో అనేక విషయాలపై చర్చించడం జరిగింది,” అని డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు.
కాగా, గతంలో కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపడతారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ (Veerappa Moily) కీలక వ్యాఖ్యలు చేశారు. “డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవడం ఖాయం. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. కొంచెం టైం పట్టొచ్చు కానీ డీకే శివకుమార్ (DK Shivakumar) సీఎం అవడం మాత్రం తప్పకుండా జరుగుతుంది,” అని వీరప్ప మొయిలీ అన్నారు.