Delhi: ఫిబ్రవరి 19న ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం!

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడిన రోజులు గడుస్తున్నా , ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అమెరికా(America), ఫ్రాన్స్ (France) పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ (Modi) భారత్‌కు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah), పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం నూతన సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది. ఇక, ఎన్నికల్లో గెలిచిన 48 మంది అభ్యర్థుల్లో 15 మందిని పార్టీ షార్ట్‌లిస్ట్ చేసింది. వీరిలో తొమ్మిది మందిని సీఎం, స్పీకర్, క్యాబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది.