Sam Pitroda: పార్టీని ఇరకాటంలో పెట్టిన పిట్రోడా.. దూరం జరిగిన కాంగ్రెస్

కాంగ్రెస్ ఓవర్సీస్ ఇన్‌చార్జ్ శామ్ పిట్రోడా (Sam Pitroda) తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనాతో భారత్‌కు ఉన్న ముప్పు ఏంటో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని పిట్రోడా చెప్పారు. దీంతో కాంగ్రెస్‌పై మరోసారి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గల్వాన్ లోయలో చైనా దళాలు చేసిన దాడిని గుర్తుచేసిన బీజేపీ.. పిట్రోడా (Sam Pitroda) మాటల ప్రకారం చూస్తే గల్వాన్ అమరులను కాంగ్రెస్ అవమానించినట్లే అని మండిపడుతోంది. పరిస్థితి చెయ్యి దాటిపోతుందని అర్థం చేసుకున్న కాంగ్రెస్.. వెంటనే పిట్రోడా కామెంట్స్ నుంచి దూరం జరిగింది. ‘‘చైనా విషయంలో పిట్రోడా (Sam Pitroda) వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదు. విదేశాంగ విధానం, భద్రత, ఆర్థికపరంగా చైనా ఇప్పటికీ భారత్‌కు సవాలుగానే ఉంది’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు.
‘‘చైనా పట్ల మన దేశం వైఖరి మొదటి నుంచి కటవుగానే ఉంది. ఇలాంటి విధానాల వల్ల దేశానికి కొత్త శత్రువులు తయారవుతున్నారు. భారత్‌కు ఎక్కడి నుంచి సరిగా మద్దతు లభించడం లేదు. ఇప్పటికైనా భారత్ తన వైఖరిని మార్చుకోవాలి. ఇది కేవలం చైనా విషయంలోనే కాదు. ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. అయినా చైనా నుంచి భారత్‌కు ఉన్న ముప్పేంటో నాకు అర్థం కావట్లేదు. చైనాను శత్రువు అంటూ మాటిమాటికీ చెప్పే అమెరికా.. భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోంది’’ అని పిట్రోడా (Sam Pitroda) అన్నారు.