CM Nitish Kumar: లాలూ రాజకీయాల్లో ఎదగడానికి నేనే కారణం: నితీశ్ కుమార్

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kumar) అసెంబ్లీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై మండిపడ్డారు. తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తేజస్వీపై నీతీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినట్లు చెప్పిన ఆయన.. లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదగడంలో తనదే ప్రధాన పాత్ర అన్నారు. “గతంలో బిహార్ పరిస్థితి ఎలా ఉండేదో మీకు గుర్తుందా? సాయంత్రం అయ్యాక ఎవరూ బయటకు వచ్చేవారే కాదు. నువ్వు అప్పుడు చిన్న పిల్లవాడివి. ప్రజలను వెళ్లి అడుగు. నీ తండ్రి ఈ స్థాయికి ఎదిగాడంటే, అది నా వల్లనే. లాలూకు ఎందుకు అండగా నిలిచానని నీ సొంత కుటుంబ సభ్యులే నన్ను అడిగారు. అయినా, నేను అతనికి మద్దతుగా నిలబడ్డాను,” అని నితీశ్ కుమార్ (CM Nitish Kumar) చెప్పారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇందులో తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను విమర్శించారు. బడ్జెట్‌ను “అబద్ధాల పుట్ట” అని ఆరోపించిన తేజస్వీ.. రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా బడ్జెట్ ఎలా పెరుగుతోందని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు లెక్కలతో పని చేస్తోందని ఆయన ఆరోపించారు.