నోట్ల రద్దుపై సుప్రీం విచారణ.. కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నోట్ల రద్దు ప్రక్రియపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 2016లో నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న బీజేపీ ప్రభుత్వం.. పాత రూ.వెయ్యి నోట్లను పూర్తిగా రద్దు చేసి, రూ.500 నోట్ల స్థానంలో కొత్త వాటిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే నోట్ల రద్దు ప్రక్రియపై సమగ్రంగా అఫిడవిట్లు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించింది. న్యాయస్థానం ముందుకు ఒక అంశం వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమకు ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం ఈ సందర్భంగా తెలియజేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయపరమైన సమీక్ష పాటించాల్సిన ‘లక్ష్మణరేఖ’ గురించి తమకు తెలుసునని బెంచ్ వ్యాఖ్యానించింది.






